అట్లతద్ది నోము
(Atla Taddi Nomu)
కథ
పూర్వం ఒకప్పుడు ఒక రాజు కూతురు, మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఆరోజు అట్లతద్ది. రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇంతలో రాజుగారి కూతురు ఆకలితో సొమ్మసిల్లి పడింది. రాజకుమారుడు తన చెల్లి అవస్థ చూసి ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి 'అదిగో చంద్రోదయమైంది. అమ్మా!కొంచెం పండ్లు తిని పూజ చేసుకో' అన్నాడు.
రాజకుమార్తె ఆహారం సేవించి పూజ చేసుకుంది. అయితే ఈ పూజ నియమం చంద్రోదయం చూసి అప్పుడు షోడశోపచారాలతో ఉమాదేవిని పూజించాలి. అందుకే ఈ వ్రతానికి 'చంద్రోదయ ఉమావ్రతం' అని పేరు వచ్చింది.
రాజకుమార్తె తన స్నేహితురాళ్ళతో అన్నీ యథావిథిగానే చేసింది. కానీ అన్న చెప్పిన మాట నమ్మి చంద్రోదయానికి ముందే భోజనం చేసింది. ఆమెకు ముసలివాడు భర్తగా లభించాడు. “అయ్యో అట్లతద్ది నోము చేస్తే అందమైన భర్త లభిస్తాడన్నారు కదా! నా స్నేహితురాళ్ళకందరికీ మంచి యౌవనవంతులైన భర్తలు లభించారు. నేనేమి అపచారం చేశాను?” అంటూ దుఃఖించి పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించగా వారు ప్రత్యక్షమై" నీ అన్న ప్రేమవల్ల వ్రతభంగం జరిగింది. రేపు ఆశ్వయుజ బహుళ తదియ, నీవు నియమనిష్టలతో చంద్రోదయ ఉమావ్రతం చేస్తే నీ భర్త యౌవనవంతుడవుతాడు" అన్నారు. ఆమె ఆ నోము చేసి కథ చెప్పి అక్షింతలు తీసుకుని భర్తమీద వేసేసరికి అతడు యౌవనవంతుడయ్యాడు .
ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ తదియనాడు స్త్రీలంతా ఆనందోత్సాహాల్తో అట్లతద్ది జరుపుకుంటారు. అట్లతద్దికి ముందురోజును భోగి అంటారు. భోగినాడు స్త్రీలంతా చేతులకు, పాదాలకు, గోరింటాకు పెట్టుకుంటారు. పండుగనాడు అట్లు వండి అమ్మవారికి నివేదన చేస్తారు.దాని కోసం ముందు రోజే పిండి కొట్టుకోవడం, మినప్పప్పు రుబ్బి అట్లు తయారుచేయటం ఒక పెద్ద కార్యక్రమం. ఇంట్లో ఊయల కడతారు. పెరట్లో చెట్లకి కూడా ఉయ్యాల వేస్తారు. ఈ ఉత్సవంలో పిల్లలంతా ఆసక్తిగా పాల్గొంటారు.
అట్లతద్దినాడు తెల్లవారుఝామున లేస్తారు.అన్నం, గోంగూర పచ్చడి, పెరుగుతో కడుపునిండా తింటారు. 'అట్లతద్దోయ్, ఆరట్లోయ్ ముద్దపప్పు మూడట్లోయ్' అంటూ అరుస్తూ ఇరుగు పొగురు స్నేహితులందరితో కలిసి ఆటలు ఆడతారు. ఇందులో పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. పిల్లలతో బాటు తల్లులు కూడా బాల్య జీవితాల్లోకి వెళ్లి ఆనందం పొందుతారు.
అట్లతద్ది - గౌరీదేవి
త్రిలోక సంచారి అయిన నారదముని ప్రోద్బలంతో గౌరీదేవి శివుని పతిగా పొందగోరీ మొదటిసారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసమై చేసుకునే వ్రతం ఇది. ఈ పండుగలో అమ్మవారికి అట్లని నైవేద్యంగా పెట్టడంలో అంతరార్థం. నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహాప్రియం. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోష పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులూ రావని నమ్మకం. ఋతుచక్రం సరిగా వుండేలా చేసి కాపాడతాడు. అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలూ వుండవు. మినప పిండి, బియ్యపు పిండిని కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువుకు, బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భదోషాలు తొలిగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి.
ఈరోజున తెల్లవారు ఝామున మేల్కొని గౌరీదేవి పూజ చేయాలి.చంద్రదర్శనం అనంతరం శుచియై తిరిగి గౌరీపూజ చేసి, ఆమెకు పది అట్లు నైవేద్యంగా పెట్టాలి. తర్వాత ముత్తయిదువులకు అలంకారం చేసి, పది అట్లు, పది ఫలాలు వాయనంగా సమర్పించాలి. అట్లతద్ది నోము కథ చెప్పుకొని, అక్షింతలు వేసుకోవాలి. అనంతరం భోజనం చేయాలి.
పది మంది ముత్తైదువులకు నల్లపూసలు, లక్కకోళ్ళు, రవికెలగుడ్డ, దక్షిణ తాంబూలాలు మరియు పది అట్లు వాయనమిచ్చి, భోజనాలు పెట్టి ఆశీస్సులు తీసుకోవాలి. పదేళ్లు ఈ వ్రతాన్ని నిర్వహించి, ఉద్యాపనం చెప్పుకున్న స్త్రీలకు సంసారంలోని సర్వసుఖాలు లభిస్తాయి.
అట్లతద్ది ప్రాముఖ్యత
_____________________
_____________________
అట్ల తద్ది నోము ఎలా చెయ్యాలి
_____________________________________________
Atla Taddi or Atla Tadiya
http://www.chivukulas.com/2014/10/how-to-celebrate-atla-taddi.html
http://theancientindia.blogspot.in/2012/10/atla-taddi.html
https://en.wikipedia.org/wiki/Atla_Tadde
No comments:
Post a Comment